Breaking

19, జులై 2021, సోమవారం

ఈ ఊర్లో ఆంజనేయ స్వామి అడుగడుగునా దర్శనమిస్తాడు, Anjaneya Swamy Temple Vellulla Village Jagityal District Telangana, Lord Hanuman Temple in Telangana

 మిత్రులందరికీ స్వాగతం.

ఈ ఆర్టికల్ లో మీకు నేను చిన్న గ్రామంలో 40కి పైగా ఆంజనేయ స్వామి దేవాలయాలు ఉన్న ఒక ఊరి గురించి చెబుతాను. ఏ ఊర్లో అయినా ఆంజనేయస్వామికి ఒకటి లేదా రెండు లేదా మూడు గుళ్ళు ఉంటాయి. కొన్ని చోట్ల మహా అయితే నాలుగు లేదా ఐదు ఉంటాయి. కానీ ఈ ఊళ్ళో అక్షరాలా 43 ఆంజనేయస్వామి దేవాలయాలు ఉన్నాయి. ఇంతకీ ఈ గ్రామం ఎక్కడుందనేగా మీ సందేహం.  వివరాల్లోకి వెళ్తే. ఏ ఊర్లో అయినా భూత పిశాచాల బెడద నుంచి కాపాడుకోవడానికి హనుమాన్ విగ్రహం పెట్టడం ఆనవాయితీ. కానీ ఇక్కడి హనుమంతుడు ఊరికి నలుదిక్కులా కొలువై తమను కాపాడుతున్నాడని చెబుతారు జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం వెల్లుల్ల గ్రామవాసులు. ఈ గ్రామంలో హనుమంతుడు విభిన్నమైన అవతారాల్లో దర్శనమిస్తాడు. అంతేకాకుండా ఈ గ్రామంలో వీధి వీధినా మరియు పంట పొలాల్లో కూడా హనుమంతుడి విగ్రహాలు ఆలయాలు ఉన్నాయి. దాంతో ఏ పండుగ వచ్చినా ఊరంతా కలిసి స్వామికి పూజలు చేసి ఆరాధిస్తారు. ఉగాది మరియు హనుమాన్ జయంతి నాడు పెద్ద జాతర కూడా జరుగుతుంది. హనుమాన్ జయంతికి కొన్ని రోజుల ముందు నుంచి 41 రోజుల పాటు హనుమాన్ మాల వేసుకుని ఊర్లో ఉన్న దేవాలయాలు అన్నింటినీ పూజించి హనుమాన్ జయంతి రోజున మాల విసర్జన చేసి ఆంజనేయుడికి ప్రత్యేకంగా అభిషేకాలు పూజలు నిర్వహిస్తారు. ఈ వేడుక చాలా ఘనంగా జరుగుతుంది.

anjaneya swamy temples vellulla village metpalli mandal jagtial district
వెల్లుల్ల గ్రామం ఆంజనేయ స్వామి
గ్రామస్తులు చెబుతున్న వివరాల ప్రకారం పదమూడవ శతాబ్దంలో ఈ ప్రాంతాన్ని జైనులు పరిపాలించేవారు. అప్పట్లో గ్రామంలో సుమారుగా 200కు పైగా బ్రాహ్మణ కుటుంబాలు ఉండేవి. బ్రాహ్మణులు అధికంగా ఉండే ఆ ప్రదేశాన్ని బ్రాహ్మణ పురి అని పిలిచేవారంట. గ్రామంలో జరిగే వేడుకలు మరియు శుభకార్యాలను ఈ బ్రాహ్మణుల చేత చేయించేవారు. అందువల్ల అప్పట్లో ఈ బ్రాహ్మణ కుటుంబాలన్నింటినీ జైనులు పెంచి పోషించేవారు. జైనులు నిర్మించిన ఆలయాలతోపాటు బ్రాహ్మణ కుటుంబాలు దేవుళ్ళ విగ్రహాలను ప్రతిష్టించుకుని పూజలు చేసేవారు.
vellulla village jagtial telangana
వెల్లుల్ల గ్రామం

కాలక్రమేణా బ్రాహ్మణ కుటుంబాలు వేరే ప్రాంతాలకు వలస వెళ్ళడంతో ప్రస్తుతం అక్కడ రెండే కుటుంబాలు మిగిలాయి. అలాగా వాళ్ళు ఏర్పాటు చేసిన హనుమంతుడి విగ్రహాలకు ఇప్పటికీ పూజలు నిర్విరామంగా జరుగుతున్నాయి. ఊరి పడమటి దిక్కుకు అభిముఖంగా నైరుతిలో ఉన్న గండి హనుమాన్ ఆలయం గ్రామంలో మొదటి హనుమాన్ ఆలయం అని చెబుతారు. అప్పటి నుంచి ఏదైనా పని మొదలు పెట్టేటప్పుడు ఆంజనేయుడికి మొక్కుకునే సంప్రదాయం మొదలైందంట. ఆ పని పూర్తయిన వెంటనే హనుమంతుడి విగ్రహాన్ని ప్రతిష్టించి మొక్కు తీర్చుకునేవారట. గ్రామంలో ఇప్పటికీ అదే సాంప్రదాయం కొనసాగుతోంది. ఇక్కడ ఉన్న విగ్రహాల్లో కొన్నింటికి మాత్రమే ఆలయాలు ఉన్నాయి. పంట పొలాల్లో, రోడ్డుకు ఇరువైపులా, చెరువు ఒడ్డున ఎక్కడ చూసినా హనుమాన్ విగ్రహాలే కనిపిస్తాయి.
anjaneya swamy temples vellulla village metpalli mandal jagtial district
ఆంజనేయ స్వామి
ఇలా ఊరంతా కొలువైన ఆ స్వామికి ప్రతి మంగళవారం మరియు శనివారపు రోజుల్లో ప్రత్యేకమైన పూజలు నిర్వహిస్తారు. హనుమాన్ జయంతి రోజున అయితే చిన్న పెద్ద తేడా లేకుండా హనుమాన్ దీక్ష చేపట్టి పూజలు చేస్తారు. ఆ రోజున దీక్ష తీసుకున్న స్వాములు చేసే పూజలు భజనలు చూసేందుకు రెండు కళ్ళూ చాలవంటే నమ్మండి. ఆ వేడుక ఎంతో కన్నుల పండువగా జరుగుతుంది.
Best tourist places in South India
ఆంజనేయ స్వామి విగ్రహం
వెల్లుల్ల గ్రామంలో హనుమంతుని ఆలయాలే కాకుండా దగ్గర్లోని గుట్టపైన ప్రహ్లాద సహిత లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం కూడా ఉంది. ఈ ఆలయాన్ని కూడా జైనులే కట్టించారని చరిత్ర చెబుతోంది. అంతేకాకుండా ఈ గుడిలో ప్రతి సంవత్సరం లోక కల్యాణార్థం యాగాలు, ఉత్సవాలు జరుగుతుంటాయి. అంతేకాకుండా పురాణ ఓంకారేశ్వర ఆలయం, గణపతి సన్నిధానం మరియు గ్రామ శివారులో ఎల్లమ్మ గుడిని కూడా చూడొచ్చు. ఏ పండుగ వచ్చినా చుట్టుపక్కల ప్రాంతాలకు చెందిన వారు కూడా ఈ గ్రామానికి వచ్చి ఆలయాలను దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటారు. ఆ విధంగా ఈ గ్రామానికి తెలంగాణ రాష్ట్రంలోనే ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఓకే ఊరిలో ఎన్ని ఆంజనేయ స్వామి విగ్రహాలు ఉండటం నిజంగా ఆశ్చర్యమే. బహుశా ఇటువంటి గ్రామం భారతదేశంలోనే ఎక్కడా ఉండదు కూడా.
ఈ గ్రామానికి ఎలా చేరుకోవాలి...?
జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణం నుంచి వెల్లుల్ల గ్రామం సుమారుగా నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంది. జగిత్యాల జిల్లా కేంద్రం నుంచి 38 కిలోమీటర్ల దూరంలో ఈ గ్రామం ఉంది. ఈగ్రామానికి చేరుకునే భక్తుల సౌకర్యార్థం జగిత్యాల నుంచి ఆర్టీసీ బస్సులతో పాటు ప్రైవేటు వెహికల్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.
ఈ ఆర్టికల్ మీకు నచ్చితే అందరికీ షేర్ చెయ్యండి.
జై శ్రీరామ్....🙏🙏
జై శ్రీరామ్....🙏🙏

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి