Breaking

4, జులై 2021, ఆదివారం

ఈ దేవతని దర్శించాలంటే దట్టమైన అడవిలోకి వెళ్ళాల్సిందే, ishta kameswari devi temple srisailam, Amazing Temples in India, Temples in Beautiful Locations

 మిత్రులందరికీ స్వాగతం...
ఈ ఆర్టికల్ లో మీకు నేను శ్రీశైలం అడవుల్లో కొలువై ఉన్న ఇష్టకామేశ్వరి దేవి అమ్మవారి ఆలయం గురించి నాకు తెలిసిన వివరాలన్నీ చెబుతాను. ఈ ఆర్టికల్ ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే దయచేసి షేర్ చెయ్యండి. పచ్చని చెట్ల మధ్య ఉండే ఇక్కడి గుడిలోని అమ్మవారికి బొట్టు పెట్టి ఏదైనా కోరుకుంటే ఖచ్చితంగా నెరవేరుతుందనేది ఇక్కడికి వచ్చే భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఈ అమ్మవారు నాలుగు భుజాలతో దర్శనమిస్తూ భక్తుల కోర్కెలు తీర్చే కొంగుబంగారంగా విలసిల్లుతోంది. భక్తుల కోరికలను తీరుస్తుంది కాబట్టే ఈ అమ్మవారి పేరు ఇష్టకామేశ్వరి దేవి అయ్యింది.
Best forest temples in India
ఇష్టకామేశ్వరి దేవి అమ్మవారు శ్రీశైలం
ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీశైలానికి సరిగ్గా ఇరవై కోట్ల కిలోమీటర్ల దూరంలో దట్టమైన అడవిలో ఈ దేవత గుడి ఉంది. అయితే ఈ ఇష్టకామేశ్వరి దేవిని దర్శించుకోవటానికి జీపుల ద్వారా వెళ్ళవచ్చు.
Forest Route ishta kameswari devi temple srisailam
ఇష్టకామేశ్వరి గుడికి వెళ్ళే దారి
రోడ్డు గతుకులమయంగా ఉంటుంది. నడిచి వెళ్ళడం కాస్త కష్టమే అయినా మనసులో ఆ చల్లని తల్లిని తలుచుకుని ముందుకు వెళ్తుంటే కష్టమే తెలియదు. ఈ ఆలయం యొక్క విశిష్టత ఏమంటే భారతదేశంలో కామేశ్వరీదేవి ఆలయం ఉన్న ప్రదేశం ఇదొక్కటే కావడం విశేషం. శక్తికి చిహ్నం అయిన పార్వతీదేవికి ప్రతిరూపంగా కొలిచే ఈ అమ్మవారి ఆలయం కర్నూలు ప్రకాశం జిల్లాల సరిహద్దులో సముద్రమట్టానికి 2128 అడుగుల ఎత్తులో ఉంది. కావున ఈ ప్రదేశం సంవత్సరమంతా చాలా చల్లగా ఉంటుంది. చిన్న గుడిలో కొలువై ఉన్న ఈ దేవతను దర్శించుకుని ఆమె నుదుటన బొట్టుపెట్టి పెరుగన్నం మరియు పొంగలిని నైవేద్యంగా అందిస్తే ఏ కోరికైనా నెరవేరుతుందని ఇక్కడికి వచ్చే భక్తులు అందరూ చెప్పుకుంటారు. ముఖ్యంగా పెళ్ళై పిల్లలు కలగనివారు ఈ ఆలయాన్ని ఎక్కువగా దర్శిస్తారు. స్వయంభువుగా వెలసిన ఈ అమ్మవారికి సంబంధించి ఒక చిన్న కథ ప్రాచుర్యంలో ఉంది.
Best tourist places in India
ఇష్టకామేశ్వరి అమ్మవారు శ్రీశైలం
కొన్ని వందల సంవత్సరాల క్రితం ఈ ప్రదేశంలో చాలా మంది యోగులు, సిద్ధులు తపస్సు చేస్తూ ఉండేవారట. అలా నిత్యం అమ్మవారిని స్మరించుకునే వారి కోసమే పార్వతీదేవి ప్రతిరూపమైన కామేశ్వరి దేవి ఇక్కడ వెలిసిందని చరిత్ర చెబుతోంది. మొదట్లో ఈ ప్రదేశం గురించి చాలా మందికి తెలియకపోవడం వల్ల ఇక్కడికి వచ్చే భక్తుల సంఖ్య చాలా తక్కువగా ఉండేది. కాలక్రమేణా శ్రీశైలానికి వచ్చే భక్తులు మరియు యాత్రికుల ద్వారా ఈ ఆలయం గురించి ప్రపంచానికి తెలిసింది.
Ancient temples in India, best tourist places in India
ఇష్టకామేశ్వరి అమ్మవారు శ్రీశైలం
ఈ గుడిని క్రీ.శ 8-10 శతాబ్దాల మధ్య కాలంలో కట్టించారని చెబుతారు. ఇప్పటికీ కూడా చాలా చిన్నగా కనిపించే ఈ ఆలయ గోపుర నిర్మాణం శ్రీశైల మల్లికార్జున స్వామి గర్భగుడిని పోలి ఉంటున్నట్లుగా ఉండటం విశేషం. కాబట్టి ఈ గుడి చాళుక్యుల కాలం నాటిదని చెప్పొచ్చు. శ్రీశైల పుణ్యక్షేత్రానికి ఉత్తరవాహినిగా పాతాళగంగ ఉన్నట్లుగానే ఈ ఇష్టకామేశ్వరి ఆలయానికి ఎదురుగా ఉత్తర దిశలో ఒక వాగు ఏడాది పొడుగునా ప్రవహిస్తూ ఉంటుంది. ఈ ఆలయానికి సంబంధించి ఇంకొక గొప్ప విశేషం ఏంటంటే గుడిలో ఉన్న అమ్మవారి విగ్రహాన్ని పోలిన మరొక విగ్రహం భారతదేశంలో ఎక్కడా కనపడలేదు అన్నది చాలామంది ఆధ్యాత్మికవేత్తలు ముక్తకంఠంతో చెబుతారు.
Amazing and surprising temples in India
ఇష్టకామేశ్వరి దేవి అమ్మవారు శ్రీశైలం

మహిమాన్విత క్షేత్రంగా వర్ధిల్లుతూ నిత్యం భక్తులచే పూజలు అందుకునే ఈ కామేశ్వరీదేవి ముకుళిత నేత్రాలతో, ధ్యాన ముద్రతో, చతుర్భుజాలతో,
 పద్మాసనంలో కూర్చుని భక్తులకు దర్శనమిస్తుంది. ఒక చేతిలో రుద్రాక్ష, రెండు చేతుల్లో కలువ పూలు ఇంకొక చేతితో శివలింగాన్ని పట్టుకుని ఉండే రూపంలో అమ్మవారు దర్శనమిస్తుంది. చిన్నగా మరియు ఇరుకుగా ఉండే ఈ ఆలయంలోకి వెళ్ళాలంటే భక్తులు కూర్చుని వెళ్ళాలి. ఎంత కష్టమైనా గాని భక్తులు అలాగే వెళ్ళి స్వయంగా అమ్మవారికి బొట్టు పెడతారు. ఇలా భక్తుల చేత స్వయంగా బొట్టు పెట్టించుకోవడం అన్నది భారతదేశంలో ఏ ఆలయంలోనూ జరగదు. అట్లాగే అమ్మవారి నుదుట కుంకుమ బొట్టు పెడుతున్నప్పుడు నుదటి భాగం మనుషుల్లాగానే మెత్తగా ఉంటుందని భక్తులు చెబుతారు. ప్రస్తుతం ఈ ఆలయానికి చెంచు జాతి ప్రజలు పూజారులుగా వ్యవహరిస్తున్నారు. చాలాకాలం నుంచి వాళ్ళే ఈ బాధ్యతల్ని నిర్వర్తిస్తున్నారు. ఈ ఆలయానికి కావలసినటువంటి ధూపదీప నైవేద్యాలు అన్నీ శ్రీశైలం ఆలయం నుండే వస్తాయి. అట్లాగే ఆలయంలోని గుప్త నిధుల తవ్వకం కోసం వచ్చేవారి నుండి కాపాడటానికి ఈ ప్రదేశంలో నివసించే చెంచు జాతి ప్రజలు నిత్యం కాపలాగా ఉంటారు.
*ఈ ఆలయానికి ఎలా చేరుకోవాలి:
Best temples between beautiful forest location
ఇష్టకామేశ్వరి దేవి ఆలయానికి వెళ్ళే దారి
శ్రీశైలం నుండి డోర్నాల మార్గంలో 11 కిలోమీటర్లు ప్రయాణించి అక్కడి నుండి ఎడమవైపుకు నెక్కంటి మరియు పాలుట్ల అడవి మార్గంలో ముందుకు వెళ్ళాలి. దట్టమైన అటవీ ప్రాంతం కావడం వల్ల ప్రయాణం కొంచెం కష్టంగానే ఉంటుంది. కార్లు లేదా ద్విచక్ర వాహనాల్లో ఈ ప్రదేశానికి చేరుకోవడం అసాధ్యం. ఉదయం పూట దర్శనం ముగించుకుని సాయంత్రం ఐదు లోపు మళ్ళీ తిరుగు ప్రయాణం పెట్టుకుంటే బెటర్. ప్రస్తుతానికి గుడి చుట్టుపక్కల యాత్రికులు బస చేయడానికి ఏ విధమైనటువంటి సౌకర్యాలు అందుబాటులో లేవు. చిన్న పిల్లలు మరియు ముసలి వాళ్ళతో కలిసి ఈ ఆలయాన్ని దర్శించే వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా అనారోగ్య సమస్యలు ఉన్నవాళ్ళు ఈ ఆలయాన్ని దర్శించేటప్పుడు మెడిసిన్స్ దగ్గర పెట్టుకోవడం చాలా మంచిది. 2022వ సంవత్సరం అంచనాల ప్రకారం ఒక రోజుకి కేవలం 125 మందికి మాత్రమే దేవతని దర్శించుకునే అవకాశం ఉంటుంది. అటవీశాఖ ఒక్కో వ్యక్తికి ₹1000 ఎంట్రీ ఛార్జ్ వసూలు చేస్తోంది. ఉదయం ఎనిమిది గంటలకి అటవీశాఖ వారు కౌంటర్ ఓపెన్ చేస్తారు. ₹1000 ఇచ్చి ఎంట్రీ టికెట్ తీసుకోవాలి. ఒకవేళ మీరు దర్శనానికి వెళ్లకపోతే మీ ఎంట్రీ టికెట్ రుసుము తిరిగి ఇవ్వడం జరగదు. తెల్లవారుజాము నుంచే కౌంటర్ వద్ద క్యూ ఉంటుంది. కాబట్టి ముందే ఉండేలా మీ ఏర్పాట్లు చేసుకోండి. అట్లాగే ప్రకృతి ప్రేమికులకు ఈ ప్రదేశం ఒక స్వర్గం లాంటిది. దట్టమైన అటవీ ప్రాంతం, పచ్చని చెట్లు ఇక్కడి ప్రకృతి రమణీయతను చూడటానికి రెండు కళ్ళూ చాలవంటే నమ్మండి. కాబట్టి శ్రీశైలం వెళ్ళినప్పుడు ఈ ప్రదేశాన్ని కూడా తప్పకుండా దర్శించుకోండి.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
సర్వేజనా సుఖినోభవంతు.

1 కామెంట్‌: